నీటి విషయంలో వెనక్కి తగ్గని ఏపీ.. తెలంగాణాది వితండవాదమే !

-

నదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదని, కృష్ణా నదిపై పోతి రెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఏపీ ప్రభుత్వం ఆపాలని కేసీఆర్ డిమాండ్ చేస్తోన్నా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్‌ చేయడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదని ఏపీ సర్కార్ చెబుతోంది. రాయలసీమ ప్రాజెక్టులకు నీరందాలంటే కచ్చితంగా 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి తీరాల్సిందేనని ఏపీ కూడా అపెక్స్ కౌన్సిల్ లో స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. రోజుకు 3 టీఎంసీల మేర మొత్తంగా 299 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి లిఫ్ట్‌ చేసేందుకు తెలంగాణ కూడా అంగీకరించిందని ఏపీ ఇరిగేషన్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా కొత్తగా నీటి నిల్వ సామర్థ్యం, కొత్త ఆయకట్టు రావడం లేదని చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం కావాలనే యాగీ చేస్తోందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇదే విషయాన్ని సీఎం జగన్‌ కూడా అపెక్స్‌ కమిటీలోనూ చెప్పారని సమాచారం. రాయల సీమ జిల్లాలు సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మొత్తంగా 600 టీఎంసీల నీరు అవసరమవుతాయని గతంలో తెలంగాణ సీఎం కేసీఆరే అన్నారని ఏపీ ఇరిగేషన్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వానిది కచ్చితంగా వితండవాదమేనని ఏపీ ఇరిగేషన్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version