ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పల్లా శ్రీనివాస్ తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరగా పరీక్షల అనంతరం వైద్యులు వైరల్ ఫీవర్‌గా నిర్దారించారు.అయితే, గతకొన్ని రోజులుగా శ్రీనివాస్ వరద బాధిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు బాధితులను పరామర్శించి వారి కుటుంబాల్లో భరోసా నింపారు. అయితే, ప్రస్తుతం శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
మరో రెండు లేదా మూడు రోజుల్లో ఆయన కోలుకుంటారని వైద్యులు తెలిపారు. ఇదిలాఉండగా, గత జూన్ 28వ తేదీన పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కకపోగా సీఎం చంద్రబాబు ఆయన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి గౌరవ స్థానం కల్పించారు.