వాడి పాడేసి ప్లాస్టిక్ బాటిళ్లు తెచ్చింది.. వాటికి సర్జెరీ చేసింది.. అయినా ప్లాస్టిక్ బాట్టిల్స్ కు ఏం సర్జరీ అనుకుంటున్నారా? కేరళకు చెందిన అపర్ణ అనే అమ్మాయి అదే చేస్తుంది. సర్జెరీ అంటే సర్జెరీ కాదు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చి రంగులొద్ది, కళాకృతులను తయారు చేస్తున్నది..
కేరళలోని కొల్లామ్ జిల్లాకు చెందిన 23 ఏండ్ల అపర్ణకు ఓ అందమైన ఆలోచన వచ్చింది. తన ఆలోచనకు ఆమె ఓ కళాత్మక రూపం ఇచ్చింది. ఆమెలోని ఆ కళా తృష్ణే ఇప్పుడు పర్యావరణ హితంగా మారింది. వ్యర్థాలతో మురికి కూపంగా మారిన ఓ సరస్సును శుభ్రం చేసింది.
చిన్న వయసు నుంచే కళాత్మక వస్తువుల్ని రూపొందించడం అపర్ణకు ఓ హాబీ. తాను చదువుకునే కళాశాలలోని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమె రూపొందించిన కళాత్మక వస్తువుల్ని కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సహిస్తూ వచ్చారు. దాంతో, ఆమె తన ఉత్పత్తులకు ‘రుద్రా’ అనే బ్రాండ్ నేమ్‌తో సోషల్ మీడియాలో ప్రచారం కల్పించారు. ఏడాదిన్నర క్రితం వరకూ ఆమె కళంకారి వస్తువుల(టెర్రకోట జెవెలరీ) అమ్మకానికే పరిమితం. కానీ, ఇప్పుడామె మరో మహత్తర కార్యక్రమానికి మార్గదర్శిగా మారారు.
తన ఇంటికి సమీపంలోనే ఉన్న అష్టముడి కాయల్(సరస్సు) ఒడ్డున పోగుపడుతున్న చెత్తకుప్పలోని ఖాళీ గాజు సీసాలు అపర్ణ దృష్టిని ఆకర్షించాయి. దాంతో, ఆమెలో అద్భుతమైన కళాత్మక ఆకృతులు రూపుదిద్దుకున్నాయి. ఆ గాజు సీసాల్ని సేకరించి శుభ్రం చేసి వాటికి అందమైన రంగులద్దారు.
అపర్ణ చేపట్టిన ఈ కార్యక్రమం కొల్లామ్ జిల్లా ప్రజల్లో కదలిక తెచ్చింది. సరస్సు చుట్టుపక్కల ఉన్న పౌరులే ఖాళీ బాటిళ్లను సేకరించి ఆమెకు పంపిస్తున్నారు. దీంతో, ఇప్పుడు అష్టముడి సరస్సు క్లీన్‌గా కనిపిస్తోంది. ఖాళీ బాటిళ్లు ఎప్పటికపుడు రీసైకిల్(పునర్ వినియోగం) అవుతున్నాయి. ఈ నెల 17న స్థానిక బస్టాండ్ వద్ద తన స్నేహితులతో కలిసి చేపట్టిన క్లీనప్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. దాదాపు ఓ ట్రక్కు ఖాళీ సీసాల్ని ఆరోజు సేకరించి రీసైక్లింగ్‌కు పంపించారు. అంతేగాక ఆరోజు అక్కడి రహదారి చుట్టుపక్కల చెత్తనంతా స్వచ్ఛంద కార్యకర్తలు తొలగించారు. దీంతో స్ఫూర్తి పొందిన అపర్ణ ప్రపంచ నీటి దినోత్సవం రోజున(మార్చి 22న) మరో కార్యక్రమాన్ని చేపట్టారు. డీటీపీసీ అడ్వెంచర్ పార్క్‌లో చేపట్టిన ఈ కార్యక్రమంలో 100 మంది వరకూ ఔత్సాహిక విద్యార్థులు పాల్గొన్నారు. ఇంజినీరింగ్, ఫ్యాషన్ డిజైన్ కళాశాలల విద్యార్థులు ఆ రోజంతా పార్క్‌ను శుభ్రం చేసి, సాయంత్రం వేళ స్టాల్ నిర్వహించారు. అపర్ణ గాజు బాటిళ్లతో ప్రారంభించిన కార్యక్రమంతో స్ఫూర్తి పొందిన కొందరు ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తూ రీసైక్లింగ్‌కు పంపిస్తున్నారు.
కళాత్మక వస్తువుల్ని రూపొందించడం పట్ల ఆసక్తి ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా పని చేసే తన తల్లి నుంచే మొదలైందని అపర్ణ తెలిపారు. ఇందుకోసం తనకు ఎలాంటి శిక్షణ లేదని ఆమె అన్నారు. లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా బాధితులకు సాధికారత కల్పించడం కోసం నిర్భయ షెల్టర్ హౌంతో కలిసి పని చేయాలన్నది తన భవిష్యత్ ప్రణాళికగా అపర్ణ తెలిపారు. తాను చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి పొందేందుకు వారికి అవకాశం కల్పిస్తానని ఆమె తెలిపారు.