జగన్ ప్రభుత్వానికి ఆరు మాసాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆయన పాలనపై అనేక విశ్లేషణలు వస్తు న్నాయి. నాకు కనీసం ఆరు మాసాల గడువు ఇవ్వండి- అని సాక్షాత్తూ జగనే ప్రజలను కోరడం తెలిసిందే. ఇప్పుడు ఆ సమయం అయిపోయింది. అయితే, ఈ క్రమంలో జగన్ కేబినెట్‌లో పనిచేస్తున్న 24 మంది మంత్రుల పరిస్థితిపై చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఈ ఆరు మాసాల్లో అసలు మైకు ముందుకు కూడా రాని మంత్రులు చాలా మంది ఉన్నారు. వీరిలో పినిపే విశ్వరూప్.. తానేటి వనిత వంటి వారు ఉండగా.. ఇక, దూకుడుగా ఉంటూ.. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రులు కూడా ఉన్నారు.
వీరిలో కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ రెండు రకాలు ఇలా ఉంటే.. తీవ్ర వివాదాస్పదం అవుతున్న వారిలో మంత్రి బొత్స సత్యనారాయణ పేరు మరో రకంగా వినిపిస్తోంది. రాజధాని విషయంలో బొత్స చేస్తున్న వ్యాఖ్యలు గతంలోను, ఇప్పుడు కూడా వివాదాస్పదమే అవుతున్నాయి. రాజధాని అమరా వతో.. హైమావతో.. మరెవరో తెలియదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట సంచలనంగా మారాయి.
ఇక, ఇటీవల అమరావతిలో ఏముంది శ్శశానం చూసేందుకు చంద్రబాబు వస్తున్నారా? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకాయి. దీంతో అసలు జగన్ కేబినెట్‌లో పద్ధతిగా మాట్లాడే మంత్రులే లేరా? అంటూ చర్చ జరుగుతోంది. నిజానికి జగన్ కేబినెట్‌లోని చాలా మంది బాగా చదువుకున్న వారే ఉన్నారు. అయితే, వీరిలో చాలా మంది మౌనంగా ఉండిపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. తాము ఏం మాట్లాడితే.. టీడీపీ అనుకూల మీడియా ఎలాంటి పెడార్థాలు తీస్తుందోనని భయపడుతున్నవారు కూడా ఉన్నారు.
ఇక, మరికొందరు బాగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నా.. మీడియా ప్రతినిధులు వేస్తున్న ప్రశ్నలతో సంయమనం కోల్పోతున్నవారు కనిపిస్తున్నారు. దీంతో జగన్ మంత్రులపై ఓ విధమైన వ్యతిరేక ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. దీని నుంచి ప్రస్తుతం బయట పడాల్సిన అవసరం ప్రభుత్వానికి చాలా ఉందని అంటున్నారు పరిశీలకలు. ఈ నేపథ్యంలో జగనే చొరవ తీసుకుంటే మంచి దని సూచిస్తున్నారు.