ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికే వారికోసం కింద కొన్ని విషయాలు ఇవ్వబడ్డాయి. ఏదో సినిమాలో అన్నట్టు, ఒక్కొక్కరికి ఆనందం ఒక్కో దానిలో దొరుకుతుంది. అది ఎందులో దొరుకుతుందో ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఐతే ఆనందం దొరకకుండా అడ్డుకునే విషయాల గురించి ఇక్కడ చర్చిద్దాం.
ఇతరులతో పోల్చుకోవడం
నువ్వెలా ఉన్నావో అదె నువ్వు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుని బాధపడిపోవద్దు. నీకున్న పరిస్థితులు వారికున్న పరిస్థితులు వేరు కావచ్చు. నీకు లేని అదృష్టం ఏదో వారికి ఉండవచ్చు. ఒకే ఇంట్లో ఉన్న వారే ఒకేలా ఉండనపుడు ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండాలని అనుకోకూడదు. అందుకే పోలిక అనవసరం.
వాదన అనవసరం
వాదన వల్ల చాదస్తం పెరుగుతుంది. ఐతే కొన్ని వాదనలు జ్ఞానాన్ని ఇస్తాయి. ఎలాంటి వాదనలు జ్ఞానాన్ని ఇస్తాయనేది నువ్వే నిర్ణయించుకోవాలి. మరీ ముఖ్యంగా మూర్ఖులతో వాదించడం అనవసరం. వాదనలో మీరు గెలిచే అవకాశం ఉంటుందేమో కానీ అవతలి వారు వారి అభిప్రాయాన్ని మార్చుకోనపుడు మూర్ఖంగా వాదించకూడదు.
తాము చేసే పనులకి ఇతరుల మీద నిందలు వేయడం అస్సలు కరెక్ట్ కాదు. అలాగే వాయిదా వేయడం. చాలామంది ఈ జబ్బుని వదిలించుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేరు. వాయిదా వేయడం అనేది మరీ ఎక్కువగా ఉంటే మీ విజయానికి మీరే అడ్డుగా ఉంటున్నట్టు అర్థం.
కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళవద్దు. ఇక్కడికే చాలు అనుకోకండి. కలలు కనండి. వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి.
నీ మీద నమ్మకం కోల్పోవద్దు. ప్రపంచంలో అందరూ నిన్ను నమ్మకపోయినా సరే, గెలుస్తావన్న నమ్మకం నీకుంటే చాలు. నువ్వే గెలుస్తావు.