మీరు ఏదైనా బ్యాంకుకు చెందిన కస్టమరా ? ఏదైనా సమస్య వచ్చి కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలని గూగుల్‌లో లేదా ట్రూ కాలర్ వంటి యాప్స్‌లో సదరు బ్యాంకు కస్టమర్ కేర్ నంబర్ కోసం వెదుకుతున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి వినియోగదారులే టార్గెట్ గా ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
మీరు ఏదైనా బ్యాంకుకు చెందిన కస్టమర్ అయితే ఆ బ్యాంకుకు చెందిన యాప్ లేదా సైట్‌లో మాత్రమే ఆ బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్ నంబర్‌ను తెలుసుకుని దానికి ఫోన్ చేయాలి. అంతేకానీ ఆ నంబర్ల కోసం గూగుల్ లేదా ట్రూ కాలర్ వంటి యాప్స్‌లో వెతకవద్దు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు అచ్చం బ్యాంకు టో ఫ్రీ నంబర్లను పోలిన నంబర్లను తీసుకుని వాటి పేరిట ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ నంబర్లను నిజమే అని నమ్మిన వినియోగదారులు ఈ నంబర్లకు ఫోన్ చేస్తున్నారు. ఇక అవతలి వారు కూడా హుందాగా మాట్లాడేసరికి వారు నిజంగానే బ్యాంకు సిబ్బంది అని నమ్మి మోసపోతున్నారు. వారు అడిగే అన్నింటికీ వివరాలు ఇస్తున్నారు. దీంతో క్షణాల్లోనే వినియోగదారులకు చెందిన బ్యాంకు అకౌంట్లలోని నగదు మాయమవుతోంది.
ప్రస్తుతం ఇలా నకిలీ టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా మోసాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిందని ఆర్‌బీఐ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ ఆఫీస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐటీ రిస్క్ గ్రూప్ అనే సంస్థతో కలిసి ఆర్‌బీఐ ఓ సంయుక్త ప్రకటనను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఏ బ్యాంకుకు చెందిన కస్టమర్ అయినా సరే ఆ బ్యాంకుకు చెందిన కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయాలంటే.. ఆ బ్యాంకు యాప్ లేదా అధికారిక సైట్‌లో మాత్రమే నంబర్ కోసం వెదకాలి. గూగుల్ లేదా ట్రూ కాలర్ వంటి యాప్స్‌లో ఆ నంబర్ల కోసం వెదకకూడదు. అలాగే ఎవరైనా వినియోగదారులకు చెందిన బ్యాంకు అకౌంట్ వివరాలు, లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్ లు, ఓటీపీలు అడిగితే ఎట్టి పరిస్థితిలోనూ చెప్పరాదు. బ్యాంకులు ఎప్పుడూ ఆ వివరాలను అడగవు. కనుక ఈ విషయాలను గుర్తుంచుకుంటే బ్యాంకింగ్ ఫ్రాడ్‌లు జరగకుండా జాగ్రత్తపడవచ్చు.