ప్రధాని నరేంద్రమోదీ ఉద్యోగాల భర్తీ పై చేసిన ప్రకటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో స్పందించారు.కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఎనిమిది ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేపడతామని ప్రకటించడం సరికాదన్నారు.
ఇప్పటికే కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రధాని మోదీ ప్రభుత్వం.. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం 55 లక్షల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందని, కానీ ప్రధాని మోడీ కేవలం పది లక్షల ఉద్యోగాలు ప్రకటించారని ఇది సరికాదన్నారు. నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసేదని అభిప్రాయపడ్డారు.