శ్రీకాకుళం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో మొదలయిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గెలిచిన సంతోషంలో కొందరు ఓడిన బాధలో మరికొందరు ఒకరి పై ఒకరు దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇప్పటికే నిన్న ఒక గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా తాజాగా ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయుల పై చేసిన దాడి భయాందోళనలకు గురి చేసింది. నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల్లో బుడగట్లపాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధిగా టీడీపీ మద్దతుదారుడు అల్లిపిల్లి రాంబాబు గెలుపొందాడు.
దీంతో కౌంటింగ్ పూర్తయిన నాటి నుంచి టీడీపీ పై గుర్రుగా ఉన్న వైసీపీ వర్గీయులు పలు మార్లు వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఈ ఉదయం ఓ 20 మందికి పైగా వైసీపీ వర్గీయులు టీడీపీ మద్దతుదారుల ఇళ్ల పై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు, అడ్డొచ్చినవారిని చితక్కొట్టారు. ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వారి పై దాడులు చేయడంతో పాటు వస్తువులన్నింటినీ ధ్వంసం చేసేశారు. ఫ్రిజ్ లు, టీవీలు , కూలర్లు ఇలా చేతికి ఏది దొరికితే అది ధ్వంసం చేశారు. వైసీపీ వర్గీయుల దాడిలో పది మంది టీడీపీ మద్దతుదారులు గాయడపడటంతో వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. ఇరువర్గాల ఈ ఘర్షణతో బుడగట్ల పాలెంలో తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.