మొన్న పంజాబ్, నిన్న లక్నో, అనంతరం యూపీలోని మొరాదాబాద్ సహా పలుచోట్ల.. అనంతపురంలోని గుత్తి క్వారంటైన్ లో ఒకసారి, హైదారాబద్ లోని సనత్ నగర్ లో మరోసారి.. తాజాగా ఉత్తరప్రదేశ్ అలీగఢ్ లో! ఇవన్నీ కరోనా బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలో, గ్రీన్ జోన్, రెడ్ జోన్ లో కాదు… పోలీసులపై దాడులు చేస్తున్న ప్రాంతాలు! అన్నం పెట్టిన చేతినే నరకడం.. పాలు తాగి తల్లి రొమ్మును గుద్దడం.. తిన్నింటి వాసాలు లెక్కెట్టడం… ఇలా ఎన్ని మాటలు చెప్పుకున్నా పర్లేదు అనేస్థాయిలో కొందరు అజ్ఞానులు.. పోలీసులపై దాడులకు తెగబడుతున్నారు.
లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో పటియాలాలోని ఓ వెటిటేబుల్ మార్కెట్ దగ్గర లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొందరు కత్తులతో దాడులు చేశారు. సాయంత్రం ఆరుగంటల అనంతరం గుమిగూడిన యువకులతో… ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించిన పోలీసులపై సనత్ నగర్ లో కొందరు యువకులు చేతులతో, కర్రలతో దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో పోలీసులపై సుమారు 10 మంది పురుషులు, 8 మంది మహిళలు దాడులు చేశారు! తాజాగా ఉత్తరప్రదేశ్ అలీగఢ్ దుకాణాలను మూసివేయాలని చెప్పేందుకు వెళ్లిన పోలీసులపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీసుకు తీవ్రగాలవడంతో… యూనిఫాం మొత్తం రక్తంతో తడిసిపోయింది. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే… ఇంకా వెలులోకి రానివి దేశవ్యాప్తంగా ఎన్ని ఉండి ఉండొచ్చు?
ఈ విషయంలో పోలీసులు సీరియస్ గా తీసుకుని ఒక్క 12 గంటలు విధులకు దూరంగా ఉంటే… దేశం పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచిద్దాం! ఈ దేశంలో ప్రతీ ఒక్క రంగానికి చెందినవారు ధర్నాలు చేస్తారు.. పెన్ డౌన్ లు చేస్తారు! ఎన్ని భౌతిక దాడులు జరిగినా, మరెన్ని మానసిక దాడులు జరిగినా… అన్నింటికీ ఓర్చుకుని విధి నిర్వహణే ముఖ్యం అనుకునే పోలీసులపై ఎందుకు ఈ దాడులు? ప్రజల కోసం, దేశారోగ్యం కాపాడటం కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులపై ఇకనైనా ఈ దాడులు ఆపాలని కోరుకుందా! ఇలాంటి పనికిమాలిన దాడులకు పాల్పడేవారు కాస్త విజ్ఞతతో ఆలోచించే జ్ఞానం దేవుడు వారికి ప్రసాదించాలని ఆశిద్దాం!
ఇలా పోలీసులపై దాడులు చేసే వారికి కాస్త కనువిప్పు కలిగే ఒక ఉదాహరణ ఇప్పుడు తెలుసుకుందాం!… వారికున్నది ప్రత్యక్ష శతృత్వం కాకపోయినా వర్గపోరులో భాగంగా పోలీసులకు – మావోయిస్టులకు మధ్య దాడులు జరుగుతుంటూ ఉంటాయి! ఈ సమయంలో కరోనా వైరస్ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్న వర్గశత్రువు (పోలీసులు) పై పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నామని, సాయుధ పోలీసు బలగాలపై దాడులకు పూనుకోబోమని మావోయిస్టు పార్టీ ఈ మధ్యకాలంలో ప్రకటించింది! వారే అర్ధం చేసుకుని ప్రవర్తిస్తున్న ఈ తరుణంలో… ఎవరికోసం అయితే తమ ప్రాణాలను పక్కపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి… పగలు రాత్రి, ఎండా కొండా లేకుండా నడిరోడ్డుపై ప్రజలకోసం కష్టపడుతున్న పోలీసులపై దాడులు చేస్తున్నవారిని ఏమనాలి? అలాంటివారిని కూడా మనుషులే అందామా? అంటూనే… మారాలని కోరుకుందాం! ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితి రావద్దని ఆశిద్దాం!