అధికారులను చెడుగుడు ఆడుతున్న ఎమ్మెల్యేలు

-

అనంతపురం జిల్లాలో ఒకప్పుడు అధికారులదే రాజ్యం.వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారిందట…టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరే. ఒకరు బాలకృష్ణ. రెండో నేత పయ్యావుల కేశవ్‌. మిగతా అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అధికార పక్షం బలంగా ఉన్నచోట తమ వాయిస్‌కు ప్రాధాన్యం ఉండదని భావించారో ఏమో.. జిల్లా స్థాయిలో ఏ సమావేశం నిర్వహించినా వీరిద్దరూ కనిపించరు. అయినా జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు ఏవి సాఫీగా సాగడం లేదు. అధికారపక్షమే విపక్షపాత్ర పోషిస్తూ ప్రశ్నలు సంధిస్తుండటంతో సమావేశాలు దద్దరిల్లిపోతున్నాయి.

అధికారుల రివ్యూ మీటింగ్ అంటే చాలు జిల్లా ఇంఛార్జ్‌ మంత్రితో సహా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలంతా టంచనుగా హాజరవుతున్నారు. సమావేశంలో విపక్ష సభ్యులు ఉంటే.. ఆయా అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నడిచేంది. చివర్లో అధికారులు చెప్పే విషయాలకు తలాడించి ఓకే చెప్పేవారు. ఇప్పుడు విపక్ష సభ్యులు రాకపోవడంతో ఆ అరుపులు.. కేకలు ఉండబోవని.. ప్రశ్నల గోల ఉండబోదని భావించిన అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.

ఇటీవల నిర్వహించిన సమావేశానికి జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు శాఖలపై ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించారు. లెక్కల్లో ఉన్న తేడాలపై అధికారులను నిలదీయడంతో కలెక్టర్‌ జోక్యం చేసుకున్నారట. తానే స్వయంగా సమీక్ష చేశానని.. అంతా బాగుందని కలెక్టర్‌ చెప్పినా ఎమ్మెల్యేలు వినలేదట. మళ్లీ అధికారులను పిలిచి అడగాలని ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో.. పంచాయతీరాజ్‌, హౌసింగ్‌, వ్యవసాయశాఖ అధికారులను పిలిచి ప్రశ్నించారట కలెక్టర్‌.

అంతకుముందు అంతా బాగానే ఉందని ఆ మూడు శాఖల అధికారులు ఎమ్మెల్యేల వాదనతో ఏకీభవించడంతో కలెక్టర్‌ కోపం నాషాళాన్ని తాకిందట. తప్పడు సమాచారం ఇవ్వడమే కాకుండా తనను కూడా తప్పుదోవ పట్టించారని అధికారులపై మండిపడ్డారట కలెక్టర్‌. వారికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారట. ఈ చర్యల గురించి తెలిసినప్పటి నుంచీ అధికార, రాజకీయవర్గాల్లో ఒకటే చర్చ. ఇకపై జిల్లా అభివృద్ధి సమావేశాలు ఆల్‌ఈజ్‌ వెల్‌గా సాగబోవని.. ఎమ్మెల్యేలకు లెక్కలు చెప్పే సమయంలో అలర్ట్‌గా ఉండాలని అధికారవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట. మరి.. పదవీకాలం ముగిసే వరకు ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version