వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. కరీంనగర్ – హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన కూలీలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారంతా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాటు వేయడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలియడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎవరికి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.