ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పాద మహిమతో రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదని ఎంపీ అవునాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓ వైపు తండ్రి మరోవైపు కొడుకు పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో తిరుగుతుంటే వర్షాలు ఎందుకు కురుస్తాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కారణంగా వరుణుడు కరుణించడం లేదన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ పాలనలో మొదటి నాలుగేళ్లు బాగా వర్షాలు పడగా.. ఇప్పుడు మాత్రం పడడం లేదని.. గ్రామాల్లో ప్రజలే అనుకుంటున్నారని పేర్కొన్నారు.
అందుకు చంద్రబాబు, లోకేష్ ఏపీలో పర్యటించడమే కారణమన్నారు. నాలుగేళ్లు చంద్రబాబు నారా లోకేష్ హైదరాబాద్ కి పరిమితం కావడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి అన్నారు. 1999 2004 మధ్యన ఆంధ్రప్రదేశ్ కరువుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా వచ్చాయన్నారు. మళ్లీ 2014 2019 మధ్య అవే కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ సీఎం అయిన తర్వాత ఆ కాలంలో వర్షాలు కురిసాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ ఏపీ లో తమ పాదాలు మోపడంతో వారి పాదాల ప్రభావం వల్ల మళ్ళీ వర్షాలు పడడం లేదని ప్రజల అభిప్రాయపడుతున్నారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.