వైసీపీ నేతలకు, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై ట్విట్టర్ వేదిక వైసీపీ, టీడీపీ నేతలకు మధ్య వార్ జరుగుతోంది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు నేడు సీఎం జగన్ ప్రారంభించిన వాహన మిత్ర పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రారంభించిన రైతు రథం పథకాన్నే ఇప్పుడు పేరు మార్చి వైఎస్సార్ వాహన మిత్ర పేరిట ప్రారంభించారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా అయ్యన్న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని ముందుగా ఆపేయడం, ఆ తర్వాత రెండు, మూడేళ్లకు అదే పథకానికి కొత్త పేరు పెట్టి ప్రారంభించడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని సదరు ట్వీట్‌లో అయ్యన్న ఆరోపించారు. అలాంటి పథకాలను ప్రపంచంలోరనే తొలి సారి తానే తెచ్చానని చెప్పుకుంటున్న సీఎం జగన్… ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యవహారాల్లో వైసీపీ నేతలు ఆరితేరిపోయారని కూడా ఆరోపించారు అయ్యన్న.