Breaking : 9వ నిజాంగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ పట్టాభిషేకం

-

ఎనిమిదో నిజాం ముకరం జా మరణంతో ఆయన పెద్ద కొడుకు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ ​తొమ్మిదో నిజాంగా పట్టాభిషేకం చేశారు. శుక్రవారం చౌమహల్లా ప్యాలెస్‌‌‌‌లోని పట్టాభిషేక మందిరంలో కుటుంబ సభ్యులు, ట్రస్టీల సమక్షంలో ప్రార్థనలతో సాదాసీదాగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించి శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎనిమిదో నిజాం కోరిక మేరకే ఈ నిర్ణయం జరిగిందని, అసఫ్ జాహీ రాజవంశం ఆచారాలు, సంప్రదాయాలను అనుసరించి లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం జరిగిందని తెలిపారు. దీంతో నిజాం ఆస్తులు, ట్రస్టులు తదితర బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే ఊహాగానాలకు తెరపడినట్లయింది. అజ్మత్ జా 1960లో జన్మించారు. లండన్‌లో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత చదువులు చదివారు.

ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. ఫొటోగ్రఫీలోనే కాలిఫోర్నియా యూనివర్సిటీ పట్టా పొందారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా పని చేశారు. పలు లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. లండన్‌లో నివసిస్తున్నా.. తన వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణలకు పలుదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తండ్రి ముకర్రమ్‌ జా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version