టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి తన వ్యూహం మార్చుకున్నారు. ఈ నెలలో జరుగుతుందని భావించిన అత్యంత కీలకమై న పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఆయన తాజాగా మరోసారి వాయిదా వేశారని తెలిసింది. ప్రతి ఏటా మే 28-30 మధ్య అత్యంత ఘనంగా నిర్వహించే మహానాడుకు చాలా ప్రత్యేకత ఉంది. పార్టీకి భవితను నిర్దేశించే ఈ కార్యక్రమాన్ని అత్యంత కీలకంగా ప్రతి ష్టాత్మకంగా పార్టీ నిర్వహిస్తుంది. అన్నగారు ఎన్టీఆర్ ఉన్న కాలం నుంచి దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిం ది. చంద్రబాబు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దీనిని అంతే ఘనంగా నిర్వహిస్తున్నారు.
అయితే, రాష్ట్ర విభజన సమయంలో 2012 ఏడాదిలో ఒక సారి వాయిదా పడిన మహానాడు.. తర్వాత ఘనంగానే ఏటా నిర్వహిస్తూ వచ్చారు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌లోచంద్రబాబు అధికారంలోకి వచ్చాక దీనిని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా రు. 2018 మేలో జరిగిన మహానాడు తీర్మానం ఏకంగా రాష్ట్రంలో వచ్చే ఇరవై ఏళ్లపాటు పార్టీని అదికారంలోనే ఉంచేలా ప్రణాళిక లు సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే సీనియర్లకు, జూనియర్లకు కూడా పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. అయితే, అనుకున్న విధంగా ఎన్నికల్లో విజయం సాధించలేక పోయారు. ఇక, అప్పటి నుంచి పరాజయం పై లోతైన సమీక్ష చేయాలని, దీనికి మహానాడును వేదికగా మార్చుకోవాలని అనుకున్నారు.
కానీ, ఇప్పటి వరకు అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత రెండో ఏడాది నిర్వహించాల్సిన మహానాడు విషయంలోనూ చంద్రబాబు అడుగు ముందుకు వేయలేక పోతున్నారు. గత ఏడాది పార్టీ ఓటమితో నేతలు కుంగుబాటుకు గురైన నేపథ్యంలో నిర్వహించ లేక పోయారు. ఇక, ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని భావించినా.. లాక్‌డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా.. దీనిని మమ అని అనిపించాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా దీనిని నిర్వహించాలని నిన్న మొన్నటి వరకు భావించారు. అయితే, తాజాగా చేసిన నియోజకవర్గం సమీక్షలు బాబులో తీవ్ర నిరాశ సృష్టించాయని తెలిసింది.
నాయకులు ఎడమొహం పెడమొహంగా ఉండడం, పార్టీ లైన్‌ను అధిగమించి వైసీపీ నేతలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడం వంటివి చంద్రబాబుకు తీవ్ర మనో వేదన సృష్టించాయని చెబుతున్నారు. అదే సమయంలో దాదాపు 50కిపైగా నియోజక వర్గాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉండడం, చాలా చోట్ల ఇంచార్జ్‌లు లేక పోవడం వంటి కారణాలతో మహానాడులో చేసే తీర్మానాలు హాస్యాస్పదమవుతాయని భావించినట్టు సీనియర్ నేతల నుంచి మీడియాకు ఆఫ్‌ది రికార్డుగా సమాచారం అందింది.
“ఇప్పుడు పార్టీకి కావాల్సింది మహానాడు కాదు.. మహామార్పు. ఈ సమయంలో తీర్మానాలు చేసుకున్నా.. అమలు చేసే వారేరీ. బాబుకు ఇదే చెప్పా“-అని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. సో.. ఆయా కారణాలతో మహానాడుపై చంద్రబాబు వ్యూహం మార్చుకున్నారని తెలిసింది. మరి ఎప్పుడు ముహూర్తం పెడతారో చూడాలి.