ఆరోగ్య సమస్యలు ఒక్కోసారి వైద్యులకే సవాలు విసురుతుంటాయి. పుణేలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎనిమిదేళ్ల చిన్నారి ఎనిమిది నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో పడ్డ అవస్థలు ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణం తెలిశాక వైద్యులే అవాక్కయ్యారు. అది ఏదో ప్రాణాంతక వ్యాధి కాదు కేవలం ఆ తల్లి వాడిన ‘పర్ఫ్యూమ్’. వినడానికి వింతగా ఉన్నా ఈ కేసు మన నిత్యజీవితంలో మనం వాడే వస్తువుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తోంది.
పుణేలోని మిలిటరీ హాస్పిటల్ (MH)లో చేరిన ఈ బాలిక గత ఎనిమిది నెలలుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతోంది. ఎన్ని రకాల పరీక్షలు చేసినా, యాంటీబయోటిక్స్ మార్చినా ఫలితం లేకపోయింది. క్షయ లేదా ఆస్తమా అయి ఉంటుందని భావించిన వైద్యులకు చివరకు ఒక నర్సు చేసిన పరిశీలన అసలు నిజాన్ని బయటపెట్టింది.
ఆ తల్లి వార్డులోకి వచ్చిన ప్రతిసారీ పాపకు దగ్గు ఎక్కువవడాన్ని గమనించిన ఆ నర్సు, ఆమె వాడుతున్న పర్ఫ్యూమ్ ఘాటు గురించి ఆరా తీశారు. ఆ పర్ఫ్యూమ్ వాడటం ఆపివేయగానే కేవలం కొద్ది రోజుల్లోనే పాప దగ్గు మాయమైపోయింది.

శాస్త్రీయంగా చెప్పాలంటే, పిల్లల శ్వాసనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. పర్ఫ్యూమ్స్‌లో ఉండే ‘వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్’ (VOCs) కొంతమందిలో అలర్జీని ప్రేరేపిస్తాయి. ఈ కేసులో ఆ పాపకు ఆ పర్ఫ్యూమ్ వాసన పడకపోవడంతో అది తీవ్రమైన దగ్గుకు దారితీసింది.
మనం వాడే రూమ్ ఫ్రెషనర్లు, అగర్బత్తీలు లేదా పర్ఫ్యూమ్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంతటి ముప్పు కలిగిస్తాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది. పిల్లల విషయంలో సమస్య తగ్గనప్పుడు కేవలం మందులపైనే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణంపై కూడా దృష్టి పెట్టడం ఎంతో అవసరం.
చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత చాలా ముఖ్యం. ఏవైనా లక్షణాలు దీర్ఘకాలం వేధిస్తుంటే వాటి వెనుక ఉండే అలర్జీ కారకాలను గుర్తించడం మేలు. పర్యావరణం మరియు జీవనశైలిలోని చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తాయని ఈ పుణే ఘటన నిరూపించింది. పిల్లల శ్వాసకోస ఆరోగ్యం కోసం ఘాటైన వాసనలకు వారిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం.
గమనిక: ఇది ఒక ప్రత్యేకమైన అలర్జీ కేసు. మీ పిల్లల్లో కూడా దీర్ఘకాలిక దగ్గు ఉంటే, నిపుణులైన వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
