దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ ఎక్కువవుతున్న నేపథ్యంలో బజాజ్ గ్రూప్ కరోనాపై పోరాడేందుకు ముందుకు వచ్చింది. కరోనాపై పోరాటానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనాపై పోరాటానికి రూ.100 కోట్ల ఇస్తామని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న 200కు పైగా ఎన్‌జీవోలతో కలిసి కరోనాపై పోరాటంలో తాము పాల్గొంటామని బజాజ్ గ్రూప్ తెలిపింది. అందులో భాగంగానే దేశంలో ఉన్న పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మెరుగు పరిచేందుకు కావల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఆ సంస్థ తెలియజేసింది. అలాగే రోజువారీ కూలీలు, కార్మికులకు కావల్సిన సహాయాన్ని అందిస్తామని కూడా బజాజ్ గ్రూప్ తెలిపింది.
ఇక తమ ప్రధాన కార్యాలయం పూణె కేంద్రంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ప్రాంతానికి సమీపంలో ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తామని బజాజ్ గ్రూప్ తెలిపింది. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు సహాయం అందజేస్తామని, కరోనా వైరస్ వల్ల నగరాల నుంచి గ్రామాలకు వెళ్లే వారికి కూడా తగిన సహాయం చేస్తామని బజాజ్ గ్రూప్ తెలిపింది.