ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని కోరతామని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి ఎం.మణికందన్ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎం.తమిమున్ అన్సారి అడిగిన ప్రశ్నకు మణికందన్ బదులిచ్చారు. టిక్ టాక్ మొబైల్ యాప్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బ తీసే విధంగా ఉందని, దీని వల్ల యువత, మహిళలు అసభ్యకర వీడియోలను యాప్‌లో పోస్ట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని అన్సారి అన్నారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఈ యాప్‌పై నిషేధం విధించాలని కోరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే అన్సారి ప్రశ్నలకు బదులిచ్చిన మంత్రి మణికందన్.. తమిళనాడు ప్రభుత్వం యువత, మహిళల రక్షణకు టిక్ టాక్ యాప్‌ను నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
గతంలో వచ్చిన బ్లూ వేల్ యాప్‌ను నిషేధించినట్లుగానే ఇప్పుడు టిక్ టాక్ యాప్‌ను కూడా నిషేధిస్తామని మంత్రి మణికందన్ తమిళనాడు అసెంబ్లీలో తెలిపారు. ఈ క్రమంలోనే టిక్ టాప్ యాప్ నిషేధం విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కాగా టిక్ టాక్ యాప్ గతంలో musical.ly గా ఉండేది. కానీ దీనికి టిక్ టాక్‌గా పేరు మార్చి మళ్లీ వాడుకలోకి తెచ్చారు. ఇందులో ఎవరైనా 15 సెకన్ల నిడివి గల వీడియోలను పోస్ట్ చేయవచ్చు. అయితే చాలా మంది ప్రస్తుతం ఈ యాప్‌లో అసభ్యకరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. సినిమా తారలను ఇమిటేట్ చేస్తూ డబ్ స్మాష్‌లు చేయడం, అర్థనగ్న వీడియోలను పెట్టడం చేస్తున్నారు. దీంతోపాటు టిక్ టాక్ యాప్ వల్ల చాలా మంది ఆన్‌లైన్ హింసకు గురవుతున్నారు. అందువల్లే ఈ యాప్‌ను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. టిక్ టాక్ యాప్ ను ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్లకు పైగా యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
కాగా తమిళనాడులో డిసెంబర్ లో టిక్‌టాక్ యాప్ బారిన పడి హింసకు, వేధింపులకు గురైన పిల్లలు, పెద్దల నుంచి 104 హెల్ప్ లైన్ నంబర్ కు 36 కాల్స్ వచ్చాయి. అక్టోబర్ లో 23 ఏళ్ల యువకుడు టిక్ టాక్‌లో తాను ఎదుర్కొన్న వేధింపులను తట్టుకోలేక ట్రెయిన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఓ 19 ఏళ్ల పెయింటర్ తమిళనాడులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట టిక్‌టాక్ వీడియోలు చేస్తుండగా.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఇవి మనకు తెలిసిన కొన్ని సంఘటనలు మాత్రమే. నిజానికి ఈ యాప్ వల్ల చాలా మంది డిప్రెషన్ బారిన కూడా పడుతున్నట్లు తెలిసింది. అందువల్లే ఈ యాప్‌ను నిషేధించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.