దిల్లీలో కూర్చొని మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనకు కేసీఆర్ స్క్రిప్టు రాసుకున్నారని.. దిల్లీ నుంచి రాగానే డీజీపీతో కలిసి డ్రామా రక్తి కట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నాలుగు ఆణిముత్యాలు నకిలీ గ్యాంగ్ ట్రాప్‌లో పడ్డారని ఎద్దేవా చేశారు. కొడుకు, కూతుర్ని రక్షించుకునేందుకు కేసీఆర్ ఏమైనా చేస్తారని అన్నారు.
“అక్టోబరు 26న ఉదయం 11.30కు పోలీసులకు ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారట. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఫామ్‌హౌస్‌లో కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. నకిలీ గ్యాంగ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకెళ్లలేదు. ఫామ్‌హౌస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతిభవన్‌కు ఎందుకు వెళ్లారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ నుంచి బయటకు రానివ్వట్లేదు.. వారికి పోలీసులు భద్రతా పెంచాలి. నలుగురు ఆణిముత్యాలు వెళ్లి నకిలీ గ్యాంగ్ ట్రాప్‌లో చిక్కుకున్నారు. కేసీఆర్ చెబుతున్న తుషార్‌కు భాజపాతో ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ ఆగస్టు 30న జీవో జారీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే భాజపాలోకి చేర్చుకుంటున్నాం. కానీ, రాజీనామా చేయకుండానే తెరాసలో చేర్చుకుంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్‌కు నమ్మకం లేదు’’ అని బండి సంజయ్ ఆరోపించారు.