చైనా ఇటీవల లాంచ్ చేసిన భారీ రాకెట్ శిథిలాలు నియంత్రణ కోల్పోయి వేగంగా దూసుకెళ్తున్నాయి. అవి భూమిపై కూలనుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే స్పెయిన్‌లోని పలు విమానాశ్రయాలు మూసివేశారు. టార్రాగోనా, ఇబిజా, రియస్‌లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలెర్ట్ ప్రకటించారు.
చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్‌కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్‌ను దీని ద్వారా పంపారు.
ఈ భారీ రాకెట్ శిథిలాలు భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడవచ్చని తెలుస్తోంది. ఇవి చాలా వరకు అట్లాంటిక్ మహా సముద్రంలో కూలొచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. అయితే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది.