పక్క రాష్ట్రాలు ఉత్సవాలు నిర్వహిస్తుంటే మన ముఖ్యమంత్రి ఫాం హౌస్ లో పడుకున్నాడా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు,ఎం.పి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన అరాచక నిజాం ప్రభువుల పాలన నుండి విముక్తి కలిగించడం కోసం అమరులైన వేలాదిమంది తెలంగాణ వీరులకు ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అన్నారు.
వారు చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది, వారు చూపించిన తెగువ ధైర్యసాహసాలు రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఏ ప్రాంత ప్రజల కైనా వారి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం వారి జన్మహక్కు కాదనడానికి ఈ ముఖ్యమంత్రి ఎవరు…? అని అయన ప్రశ్నించారు. నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మాభిమానమే ప్రధాన ఎజెండాగా సాగిన ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు పలు సందర్భాల్లో తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరుపరని ఆనాడు ఆంధ్రా పాలకులను ప్రశ్నించిన కెసిఆర్ గారు తెలంగాణ వచ్చి 6 ఏండ్లు గడుస్తున్నా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బ తీయటం దారుణమని అన్నారు.