తెలంగాణాలో బీజేపీ జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా బీజేపీ పార్టీ తెరాసను తలదన్నే పార్టీగా అవతరించింది. ఇక దుబ్బాక విజయం గాలివాటమే అనుకున్నా గ్రేటర్ లో మార్పు చూస్తే బీజేపీ పార్టీ ఎంత బలపడిందో చెప్పొచ్చు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం నియోజకవర్గాల్లో బీజేపీ ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. అందుకు ప్రణాళికలను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రూపొందించారు.
అయితే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో బీజీపీ కార్యకర్తలు కలిసి కట్టుగా శ్రమించారని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలను పథకం ప్రకారమే హడావిడిగా నిర్వహించారని, వరద సాయం పేరుతో ఎన్నికల్లో లబ్దిపొందాలనుకున్నారని అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల కమీషన్ పూర్తిగా విఫలమైందని, టీఆర్ఎస్ చెప్పుచేతల్లోనే నడిచిందని బండి సంజయ్ ఆరోపించారు. కనీసం అభ్యర్థులను ఖరారు చేసేందుకు కూడా సమయం ఇవ్వలేదని అన్నారు.
ఇక ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ నాయకులు అడ్డదారులు తొక్కారని, టీఆర్ఎస్ అక్రమాలను అడుగడుగునా అడ్డుకున్నామని బండి సంజయ్ తెలిపారు. అదేవిధంగా 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని, అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని బండి సంజయ్ అన్నారు. అలాగే త్వరలో విజయశాంతి బీజేపీలో చేరతారని సంజయ్ తెలిపారు. ఇక గ్రేటర్ వార్ లో బీజేపీ టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చింది. ఏ పార్టీకీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. టీఆర్ఎస్ 55 స్థానాల్లోవిజయం సాధించగా, 48 స్థానాల్లో బీజీపీ సత్తాచాటుకుంది. ఇక ఎంఐఎం 44 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి బీజేపీ పుంజుకుందనే చెప్పాలి మరి.