దుబాయ్ లో సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఇరు జట్ల స్కోర్లు సమం అయి మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. అందులో బెంగళూరు నెగ్గింది. దీంతో ముంబైపై ఆ జట్టు ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేపట్టింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో ఏబీ డివిలియర్స్ 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, పడిక్కల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అలాగే ఫించ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 52 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేసేలా చూశాడు. ఈ క్రమంలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీయగా, చాహర్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఇషాన్ కిషన్ 58 బంతుల్లోనే 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసి వీరోచిత పోరాటం ప్రదర్శించాడు. అలాగే కిరన్ పొల్లార్డ్ 24 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయినప్పటికీ ముంబై మ్యాచ్‌ను టైగా ముగించాల్సి వచ్చింది. ఇక బెంగళూరు బౌలర్లలో ఉదానా 2 వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్, చాహల్, జంపాలకు తలా 1 వికెట్ దక్కింది.
ఇరు జట్లు సమాన స్కోరు చేయడంతో మ్యాచ్ టైగా ముగియగా సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 6 బంతుల్లో 1 వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.