షార్జాలో సోమవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు విసిరిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా చతికిలబడింది. దీంతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. కోల్‌కతాపై బెంగళూరు 82 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 194 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడి జట్టుకు భారీ స్కోరును అందించారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో డివిలియర్స్, ఫించ్, కోహ్లి, పడిక్కల్‌లు అద్భుతంగా రాణించారు.
33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో డివిలియర్స్ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్లను ఆఖరి ఓవర్లలో డివిలియర్స్ పరుగులు పెట్టించాడు. అలాగే కెప్టెన్ కోహ్లి కూడా డివిలియర్స్‌కు మద్దతుగా నిలిచి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 28 బంతుల్లో 1 ఫోర్‌తో కోహ్లి 33 పరుగులు చేశాడు. ఓపెనర్ ఫించ్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 పరుగులు చేయగా, మరొక ఓపెనర్ పడిక్కల్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు. కాగా కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్‌లకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా ఏ దశలోనూ రాణించలేదు. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో శుబ్‌మన్ గిల్ మినహా ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో గిల్ 34 పరుగులు చేశాడు. ఇక బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో 2వికెట్లు దక్కగా, సైనీ, మహమ్మద్ సిరాజ్, చాహల్, ఉదానాలు తలా 1 వికెట్ తీశారు.