వడ్డీ రేట్ల పెంపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఈ నెల 3వ తేదీన ఎంపీసీ సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఆర్‌బీఐ గతేడాది మే నెల నుంచి కీలక వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది ఆర్‌బీఐ. అంతకుముందు ఫిబ్రవరిలో రెపో రేటును పెంచింది ఆర్‌బీఐ. 6.25 శాతం ఉన్న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతంగా నిర్ధరించింది.