మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి.
దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని తిరుమల ప్రాంతంలో ఎన్నీ తీర్థస్థానాలు కొలువై వున్నాయి. తిరుమలలో ఉన్న పలు తీర్థారాజాల గురించి తెలుసుకుందాం….
విరజానది :
శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహ పాదాల కింద భాగంలో ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒక చిన్న బావిలా కనిపిస్తుంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు వుంటుంది. ఈ తీర్థాన్ని తలపై వేసుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
పాండవ తీర్థం :
పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘోరమైన కురుక్షేత్ర సంగ్రామం తరువాత… పాండవులు తాము చేసిన బ్రహ్మహత్య పాపాలను పోగొట్టుకోవడానికి అభిషేక స్నానాలను ఆచరించారు. అనంతరం ఆ క్షేత్రపాలకునిని పూజించి, శ్రీనివాసునుని దర్శించుకున్నారు. ఆనాడు పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్లే దీనికి పాండవతీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థం తిరుమల దేవాలయానికి ఉత్తరదిశలో వుంది.
సనక నందన తీర్థం :
పూర్వం సకననందనాదులు సిద్ధిప్రాప్తి కోసం ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సును ఆచరించారు. దాంతో వారిపేరు మీదుగా ఇక్కడ తీర్థస్థలం వెలిసింది. ఇందులో మార్గశిక శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తూ వుంటారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో వుంటుంది.
కుమారధార తీర్థం :
ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంటుంది. మాఘపౌర్ణమినాడు ఇందులో స్నానమాచరిస్తే సంతానం ప్రాప్తితోపాటు… సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది.
తుంబుర తీర్థం :
ఈ తీర్థం ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంది. పూర్వం ఇందులోనే తుంబురు నాదమహర్షి ఘోరమైన తపమును ఆచరించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతోపాటు గతంలో చేసిన సకలపాపాలన్నీ దూరమవుతాయి.
నాగతీర్థం :
శ్రీహరి దేవాలయం నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఈ తీర్థం కనువిందు చేస్తుంది. పెళ్ళికాని కన్యలు ఇందులో భక్తిశ్రద్ధలతో స్నానాలు చేస్తే.. సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భర్తను పొందుతారు.
చక్రతీర్థం :
భారతయుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురికావడం వల్ల… ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే.. వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలిగిపోయి… పుణ్యపవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం వుంటుంది.
జాబాలి తీర్థం :
పూర్వం జాబాలి అనే మహర్షి ఈ తీర్థంలో ఘోరమైన తపస్సు చేసి తరించారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే భూతప్రేత పిశాచాలు తొలగిపోవడంతోపాటు మనోవాంఛ కూడా సిద్ధిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా వుంది. హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో వున్న ఈ ఆలయానికి… వారు నిత్యం స్వామివారికి నైవేద్య ఆరాధనలు ఇస్తారు.
బాలతీర్థము :
ఈ తీర్థంలో స్నానం చేస్తే వృద్ధులు సైతం బాలురు శక్తిని పొందుతారని విశ్వాసం. అయితే ఇది సృష్టికి అవరోధం కావడంతో జలం కూడా కనిపించకుండా శిలలో మూసివేయబడింది. నాగతీర్థం నుంచి రెండువందల గజాల దూరంలోనే ఈ తీర్థం వుంటుంది.
వైకుంఠ తీర్థం :
కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో వున్న ఈ తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడు ఇక్కడ వైకుంఠసమారాధన చేస్తూ వుంటారు.
శేష తీర్థం:
శ్రీహరి దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో వున్న ఈ తీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. పర్వతాలను ఎక్కుకుంటూ.. దారిలో వున్న చిన్నచిన్న ప్రవాహాలను చాలా జాగ్రత్తగా దాటాలి. ఈ ప్రవాహాలు కూడా పాచి పట్టి వుంటాయి. ఈ తీర్థంలో ఆదిశేషుడు శిలారూపంలో వుంటాడు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నాగపాములు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూనే వుంటాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే వారికి మరోజన్మ వుండదు.
సీతమ్మ తీర్థం :
పూర్వం సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరిగివున్న కొంత భాగం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక బిలం కూడా వుంది. అయితే అందులో వున్న జలం బయటకు కనిపించదు. ఒక పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి ఆ బిలంలో తోడితే.. నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు భక్తితో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతారు.
యుద్ధగళ తీర్థం :
ఈ తీర్థం గురించి రామాయణంలో కూడా వర్ణించబడి వుంది. పూర్వం రాముడు, రావణునిని సంహరించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్య మహాపాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం ఇందులో స్నానం చేశాడు.
పద్మ సరోవరం :
పద్మావతి మందిరం దగ్గరున్న ఈ సరోవరం.. తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇందులో వున్న జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ పద్మసరోవరంలో స్నానం చేసినవారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకండా… భూతప్రేతపిశాచాలు కూడా వదిలిపోతాయి.
కేవలం ఇవి మాత్రమే కాదు… కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఎన్నో ముఖ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. పవిత్రమైన ఈ తీర్థరాజాలలో స్నానం లేదా ఆ నీళ్లను తలపై చల్లుకున్నంత మాత్రానే సకల పాపాలు పోతాయని ప్రతీతి.
ఈసారి తిరుమలకు వెళ్లినప్పుడు అవకాశం ఉన్న తీర్థాలను సందర్శించండి.
– కేశవ