గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటి వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సి ఉంది. అయితే దాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ నిర్వహణ నుంచి ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఆ అవకాశం ఇండియాకు లభించింది. అయితే టీ20 వరల్డ్ ఏమో గానీ బీసీసీఐ మీద మాత్రం భారీ ఎత్తున భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
2016 టీ20 వరల్డ్ కప్ ఇండియాలో జరగ్గా అప్పట్లో ఐసీసీ పన్ను మినహాయింపు కోరింది. కానీ మోదీ ప్రభుత్వం కేవలం 10 శాతం పన్నును మాత్రమే మినహాయింపుగా ఇచ్చారు. దీంతో బీసీసీఐకి రావల్సిన వాటాలో ఐసీసీ 23.75 మిలియన్ డాలర్ల మేర కోత పెట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈసారి అయినా పూర్తిగా పన్ను మినహాయింపు వచ్చేలా చూడాలని ఐసీసీ ఇప్పటికే బీసీసీఐకి పలుమార్లు డెడ్‌లైన్ విధించింది. తాజాగా డిసెంబర్ 31, 2020తో ఇంకో డెడ్‌లైన్ పూర్తయింది. అయినప్పటికీ బీసీసీఐ నుంచి ఈ విషయమై ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఫిబ్రవరి వరకు ఐసీసీ మళ్లీ కొత్త గడువు విధించింది.
ఇక కొత్త గడువులోగా టీ20 వరల్డ్ కప్‌కు పన్ను మినహాయింపు ఇస్తారా, లేదా అన్న విషయాన్ని బీసీసీఐ కేంద్రాన్ని కనుక్కుని ఆ విషయం ఐసీసీకి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఎదుట ఇప్పుడు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి.. టోర్నీ నిర్వహణకు గాను అయ్యే పన్ను మొత్తం రూ.906 కోట్లను చెల్లించడం లేదా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని తప్పుకోవడం. రెండోది జరిగే పక్షంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణకు దుబాయ్‌ని ఐసీసీ ప్రత్యామ్నాయ వేదికగా ఇప్పటికే సిద్ధం చేస్తోంది.
అయితే టీ20 వరల్డ్‌కప్‌కు పూర్తిగా పన్ను మినహాయింపు లభించకున్నా కొంత వరకు మినహాయింపులు లభించినా బీసీసీఐ కనీసం రూ.226.58 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే 2011లో వన్డే వరల్డ్ కప్‌ను భారత్ లో నిర్వహించినప్పుడు అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చివరి నిమిషంలో పన్ను మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటిలాగే ఇప్పుడు కూడా చివరి నిమిషంలో తమకు అనుకూలంగా కేంద్రం నుంచి నిర్ణయం వస్తుందని బీసీసీఐ భావిస్తోంది. మరి మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది ఇజ్జత్ కా సవాల్ అని తీసుకుంటున్నారు. పన్ను మినహాయింపు రాకపోయినా బీసీసీఐ ఆ మొత్తం చెల్లించి టోర్నీని స్వదేశంలో నిర్వహించాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి బీసీసీఐ తనకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఏం చేస్తుందో చూడాలి.