టీబీ రాకుండా నిరోధించే బీసీజీ టీకా తీసుకున్న దేశాల్లో మొదటి 30 రోజుల్లో కోవిడ్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని అమెరికా పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు సైంటిస్టులు తమ అధ్యయన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. భారత్ సహా అనేక దేశాల్లో అప్పుడే జన్మించిన పిల్లలకు 15 రోజుల్లోగా బీసీజీ టీకాలు ఇస్తారు. ఈ టీకాలు టీబీ రాకుండా చూస్తాయి. అయితే కరోనా వ్యాప్తి ప్రారంభమైన సమయంలో బీసీజీ టీకాలు తీసుకున్న దేశాల్లో మొదటి 30 రోజుల పాటు కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉందని గుర్తించారు.
కాగా బీసీజీ (బేసిలస్ కాల్‌మెట్ గురెన్) టీకా తీసుకోని దేశాల్లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తేల్చారు. భారత్ లాంటి దేశాల్లో బీసీజీ టీకాలను ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఎప్పటినుంచో ఇస్తున్నారు. కానీ అమెరికా తదితర దేశాల్లో ఈ టీకాలను ఇవ్వడం లేదు. అందుకనే మొదట్లో అమెరికాలో కరోనా విపరీతంగా వ్యాపించిందని అన్నారు. అయితే బీసీజీ టీకాలను మళ్లీ ఇప్పుడు ఇస్తే కరోనా రాకుండా చూడవచ్చని, ఒక వేళ వచ్చినా పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఇక బీసీజీ టీకాలను ఇవ్వడంపై సైంటిస్టులు 250 మందిపై ఇప్పటికే ప్రయోగాలను ప్రారంభించారు. మరో 2 నెలల్లో ఆ వివరాలు తెలుస్తాయి. కాగా ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో బీసీజీ టీకా కూడా ఓ ఆశాకిరణంలా కనిపిస్తోంది. పరిశోధనల్లో సత్ఫలితాలు వస్తే.. బీసీజీ టీకాను కోవిడ్ రాకుండా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.