ప్రేమించిన యువతితో తనపై తప్పుడు కేసు పెట్టించారని నిన్న రాత్రి నుంచి సెల్ టవర్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న జంగారెడ్డి గూడెంకి చెందిన రోహిత్ మీద అనూహ్యంగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయాడు రోహిత్. టవర్ పై ఉన్న రోహిత్ కు వాటర్ బాటిల్స్ అందించేందుకు మరో వ్యక్తి టవర్ ఎక్కాడు. అయితే ఈ క్రమంలో టవర్ పై ఉన్న తేనే తుట్టె కదిలింది. దీంతో తేనెటీగలు చెలరేగి రోహిత్ ని, వాటర్ బాటిల్ తీసుకువెళుతున్న మరో వ్యక్తిని తీవ్రంగా కుట్టాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి రోహిత్ సెల్‌టవర్ పైనుంచి కింద పడిపోయాడు.
తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఇన్‌ఛార్జ్ సిఐ వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళు కిందకు వచ్చేయడంతో తేనెటీగలు అక్కడే ఉన్న పోలీసులు, మీడియా వాళ్ళ మీదకు వచ్చాయి. దీంతో సంఘటనా స్థలం నుంచి భయంతో పరుగులు తీశారు పోలీసులు, మీడియా ప్రతినిధులు. ప్రేమించిన యువతితో తప్పుడు కేసు పెట్టించారని మనస్తాపం చెందిన రోహిత్ నిన్న స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. పోలీసుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో రాత్రి నుంచి టవర్ మీదనే ఉన్న రోహిత్ మీద ఇలా తేనెటీగలు దాడి చేశాయి.