తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరి జనాభా ఎంత ఉందో బడ్జెట్ లో అన్ని నిధులు కేటాయించాలన్నారు భట్టి. బీసీలు అన్యాయానికి గురయ్యారని.. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ రాజ్యం అమలు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అమలు చేసే వారే సీఎం అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానానికి అన్నీ తెలుసని.. సీఎం ఎవరు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. ఇక తెలంగాణ కోసం పోరాడిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అధికంగా ఉన్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామన్నారు భట్టి. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గానికి న్యాయం జరగలేదని అన్నారు.