భూమన కరుణాకర్‌రెడ్డి. చిత్తూరు జిల్లా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఏడాది గెలిచిన నాయకుడు. సీనియర్ నేత. వైఎస్‌కు అనుంగు శిష్యుడు కూడా. వైఎస్సార్ సీపీలో కీలకమైన స్థానంలో ఉన్నారు. చిత్తూరులో ఎందరు ఎన్ని వివాదాలు చేసుకున్నా.. తడి అంటని నాయకుడుగా భూమన పేరు తెచ్చుకున్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సీఎం కావాలని మొక్కుకున్న నేతల్లో భూమన కూడా ఉన్నారు. అయితే, అలాంటి నాయకుడికి సరైన గుర్తింపు లభించలేదా? ఆయనను జగన్ పక్కన పెట్టారా? కేవలం రెడ్డి సామాజిక వర్గమే అడ్డంకిగా మారిందా? ఇలా.. కొన్నాళ్లు చర్చ నడిచింది.
దీనిపై ఎవరూ ఎలాంటి కన్‌క్లూజన్‌కు రాలేదు. అయితే, ఇప్పుడు ఆయన కరోనా మృతులకు సంబంధించి వినూత్న నిరసనల పేరుతో ఏకంగా శ్మశానాల్లోనే తిష్టవేశారు. కరోనా మృతులకు సరైన విధంగా అంతిమ సంస్కారాలు జరగడం లేదని, బంధువులు కూడా రావడం లేదని, వైద్యులు సైతం పట్టించుకోవడంలో తాత్సారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఆయన చిత్తూరులోని ఆస్పత్రుల్లో కరోనాతో మృతి చెందుతున్నవారి మృతదేహాలను దగ్గరుండి మరీ అంత్యక్రియలు చేయిస్తున్నారు. ఇక, నిన్న ప్రజాసంఘాల నాయకులను పోగు చేసి.. శ్మశానాల్లో చితిపేర్చి అంటించి మరీ నిరసన తెలిపారు.
అయితే, భూమన ఆవేదన నిజంగా శవాలపైనేనా? ఆయన ఆవేదనంతా కూడా కరోనాపైనేనా ? లేక దీనివెనుక ఏదైనా వేరే ఉద్దేశం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం.. తిరిగేకాలు.. తిట్టేనోరూ.. ఊరికే ఉండలేవన్నట్టుగా.. పనిచేయాలని.. చేతినిండా పనిదొరకాలని, మా పార్టీ అధికారంలోకి వస్తే.. మాకు చేతి నిండా పనిదొరుకుతుందని భావించిన నాయకుల్లో భూమన కూడా ఒకరు అయితే, ఆయనను జగన్ వివిద కారణాలతో పక్కన పెట్టారు.
ఆయనకు పనిచేయాలని ఉన్నా.. ఎలాంటి బాధ్యతలూ అప్పగించలేదు. దీంతో తనపై జగన్ చూపిస్తున్న వివక్షను ఇలా నిరసన రూపంలో తెలియజేస్తున్నారా? లేక.. పనిచేసే నేతలను పక్కన పెడుతున్నారని దెప్పిపొడిచేందుకు ఈ మార్గం ఎంచుకున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి దీనికి సమాధానం రావాలంటే.. వెయిట్ చేయాల్సిందే.