ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దారుణ ఓటమి అనంతరం చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవలే బీజేపీ చేరారు. త్వరలోనే మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు తన హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ వైసీపీ నుంచి తమ పార్టీలో చేర్చుకున్న నేతలు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే మాజీ మంత్రి అఖిల ప్రియ త్వరలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలిసింది.
కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. అయితే 2014, 2019 ఎన్నికలలో టీడీపీ ఈ జిల్లాలో ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి మరీ దిగజారడంతో 2024 ఎన్నికలలో టీడీపీ పరిస్థితి ఇంకా ఎలా మారుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని వారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అయితే టీడీపీని వీడితే వైసీపీలో చేరేందుకు భూమా కుటుంబానికి ఉన్న అన్ని దారులు ప్రస్తుతం మూసుకుపోయాయనే చెప్పవచ్చు. దీంతో వారికి ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భూమా కుటుంబం త్వరలో బీజేపీలో చేరుతుందని తెలుస్తోంది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, దివంగత నేత భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు కిషోర్ రెడ్డిలు బీజేపీలో చేరుతారని సమాచారం. మొదట కిషోర్ రెడ్డి, ఆ తర్వాత అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అదే జరిగితే బీజేపీకి కర్నూలు జిల్లాలో బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో వైకాపాకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి అఖిలప్రియ కూడా చంద్రబాబుకు షాక్ ఇస్తారా.. లేదా.. అనేది చూడాలి..!