తొలివెలుగు రఘు ఇటీవలే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే… రఘు అరెస్ట్ పట్ల తెలంగాణ సర్కార్ పై అనేక విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని… నిలదీసినందుకే కేసీఆర్ ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడని విపక్షాలు ఫైర్ అయ్యాయి. అయితే ఈ కేసులో రఘుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం నల్గొండ జైలులో ఉన్న ఆయన రేపు విడుదలకానున్నాడు. తొలుత గుర్రంపోడు ఘర్షణ సమయంలో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డిని విమర్శించాడంటూ మరో కేసును కూడా మోపి… జైలులో ఉంచారు. ఈ క్రమంలో రెండో కేసులో శనివారమే బెయిల్ మంజూరైనా, గుర్రంపోడు కేసులో మాత్రం తీర్పు పెండింగ్‌లో పెట్టింది కోర్టు. తాజాగా ఆ కేసులోనూ రఘుకు బెయిల్ వచ్చింది.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తుండటంతో.. ఆయనపై కొందరు అధికార పార్టీ నేతలు కక్షగట్టి పాత కేసుల్లో అరెస్ట్ అయ్యేలా చేశారు. తొలుత ఒక కేసులో ఆయన్ను అరెస్ట్ చేయగా.. కొద్ది రోజులకే మరో కేసును ఆయనపై మోపారు. దీంతో వీలైనన్ని రోజులు తొలివెలుగు తరపున రఘు వినిపిస్తున్న గొంతును నొక్కాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారి కుట్రలు ఫలించలేదు. చివరికి రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలవుతున్నారు.