కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. తమ వారిని తమకు కాకుండా దూరం చేసింది. ఎన్నో కుటుంబాల్లో ఎంతో మంది కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తమ వారిని కోల్పోవడంతో ఆ బాధను చాలా మంది దిగమింగలేకపోతున్నారు. అయితే తన భార్యను కోల్పోయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం ఆమె జ్ఞాపకార్థం ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.
అహ్మదాబాద్‌లోని ఆనంద్ అనే ప్రాంతానికి చెందిన ధ్రువల్ పటేల్ కుటుంబం కరోనా బారిన పడింది. పటేల్‌కు, తన భార్య నేహకు, తన తండ్రికి, కుమారుడు పుర్వకు కోవిడ్ సోకింది. తన తల్లికి మాత్రం నెగెటివ్ వచ్చింది. అయితే నేహ కు మాత్రం పరిస్థితి సీరియస్ అయ్యింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. వెంటిలేటర్‌పై చికిత్సను అందించారు. కానీ ఆమెకు ఇన్‌ఫెక్షన్ అధికం కావడంతో ఆమె మే 12వ తేదీన ఉదయం 9.35 గంటలకు చనిపోయింది.
అయితే నేహా అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మూడు మొక్కలు నాటితే మంచిదని బ్రాహ్మణుడు పటేల్‌కు సూచించాడు. కానీ పటేల్ మాత్రం మూడు మొక్కలకు బదులుగా ఇప్పటి వరకు 450 మొక్కలను నాటాడు. ఆ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తానని చెబుతున్నాడు. తన భార్య ఆక్సిజన్ అందక చనిపోయిందని, భవిష్యత్తులో అందరికీ ఆక్సిజన్ అవసరం అవుతుందని, కనుకనే మొక్కలను ఎక్కువగా నాటాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన భార్యలా ఇంకొకరు చనిపోకూడదనే ఉద్దేశంతోనే మొక్కలను నాటుతున్నానని తెలిపాడు. పటేల్ చేసిన ఈ మంచి పని అందరికీ ప్రేరణ కలిగిస్తుంది.