హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఈటల రాజేందర్‌నే కాదు.. మరో పెద్ద నాయకుడు కూడా బీజేపీలోకి వస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హుజురాబాద్ నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ తెలిపారు. తమ పార్టీలోకి పెద్ద నాయకుడు రాబోతున్నారని, ఈటలకు మద్దతుగా ఉండాలని సూచించారు. అయితే ఆ నాయకుడు ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.
దీంతో తెలంగాణ నాయకుల్లో చర్చ మొదలైంది. ఇటు ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు. అటు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. ఇక ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బీజేపీలోకి వెళ్లబోయే పెద్ద నాయకుడు ఎవరనే సస్పెన్స్ నాయకుల్లో నెలకొంది. అటు టీఆర్ఎస్ నేతల్లో కూడా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్‌లో అసంతృప్తులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్, టీడీపీ లీడర్లలో కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. తమ పార్టీల నుంచి ఎవరు వెళ్లిపోతారనే టెన్షన్ కూడా మొదలైందట. బీజేపీలోకి వచ్చే పెద్ద నాయకుడిపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నే క్లారిటీ ఇవ్వాలని పలువురు అంటున్నారు.