గ్రేటర్ ఎన్నికల ప్రచారం చిన్నపాటి యుద్ధాన్నే తలపిస్తోంది. మామూలుగా అయితే తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎన్నికలు జరిగినా అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వార్ వన్‌సైడ్ అయిపోతుంది. టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో కారు పార్టీని కుదేల్ చేసిన కమలం పార్టీ అక్కడ కాషాయ జెండా ఎరగవేయడంతో గ్రేటర్లో కూడా కమలం ఏమైనా సంచలనం నమోదు చేస్తుందా ? అన్న చిన్నపాటి ఆసక్తి అయితే అందరిలోనూ ఉంది.
కేసీఆర్ గ్రేటర్లో గెలవకపోతే ఆ పార్టీ పనైపోయిందన్న ప్రచారం ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లిపోతుంది. అది జరిగితే టీఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టే.. అందుకే కేసీఆర్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని కసితో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందాన్ని అయితే కొనసాగిస్తోన్న మాట వాస్తవం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రెండు పార్టీలు పరస్పర అవగాహనతో పని చేస్తున్నాయి.
ఇదే ఇప్పుడు కేసీఆర్‌కు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఓల్డ్ సిటీని కేసీఆర్ ఇప్పటికే ఎంఐఎంకు అప్పగించేశారని బీజేపీవాళ్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్‌పై హిందూ ఓట్లలో వ్యతిరేకత పెరుగుతోంది. గతంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కేసీఆర్ హిందూగాళ్లు.. బొందూగాళ్లు అని చేసిన వ్యాఖ్యలతోనే బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లలో బీజేపీ గెలుపునకు కేసీఆర్ హిందూ వ్యతిరేకి అన్న ముద్ర ప్రజల్లోకి వెళ్లడం వల్లే కొంత సాయపడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు కూడా బీజేపీ రజాకార్ల పార్టీతో కేసీఆర్ స్నేహం చేస్తున్నారన్న విషయాన్ని సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇది గ్రేటర్ ప్రజలపై ఎంత వరకు ప్రభావం చూపుతుందన్నది తెలియదు కాని… ప్రజల్లోకి వెళితే మాత్రం గ్రేటర్ ఫలితాల్లో కొంత వరకు అయినా సంచలనం నమోదు కావొచ్చు. ఇప్పటికే నార్త్ ఇండియన్ ప్రజలు, ఆంధ్రా సెటిలర్లు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ పరిణామాలు బీజేపీ ఎంత వరకు తమకు అనుకూలంగా మార్చుకుంటుందో ? చూడాలి.
-Vuyyuru Subhash