బీఆర్ఎస్ కీలకనేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది.లగచర్ల ఘటనలో తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో ఇటీవల క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పది రోజుల కిందటే పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా పట్నం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణలో అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి ఘటనలో కుట్రదారుగా పేర్కొంటూ పట్నం నరేందర్‌ను ఏ1గా పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఏ2గా ఉన్న భోగమోని సురేష్, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని కోర్టుకు ప్రభుత్వం తరఫు లాయర్ వివ్నవించారు. సురేష్‌తో దాదాపు 89 సార్లు నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారని, మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.