ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీలో భవిష్యత్ లేదని అయినా నేతలు అందరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. టిడిపికి చెందిన పలువురు నేతలు బిజెపి, వైసీపీలోకి జంప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీడీపీకి.. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చంద్రబాబు పంపిన సంగతి తెలిసిందే. మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు… ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆప్తమిత్రుడు కావటం విశేషం. 2004లో దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2009లో నామినేషన్ సరిగా వేయక పోటీ చేయలేకపోయారు. 2014లో బాలయ్య ఒత్తిడి మేరకు సీటు తెచ్చుకుని గెలిచిన బాబూరావు…. గత ఎన్నికల్లో ఉగ్ర నరసింహారెడ్డి కోసం తన సీటు త్యాగం చేసి పక్కనే ఉన్న దర్శిలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
బాలక్రిష్ణ సూచనల మేరకు అయిష్టంగానే దర్శి నియోజకవర్గానికి కదిరి బాబూరావు మారారు. అదే ఆయన రాజకీయ భవిష్యత్ ను ముంచేసింది. కనిగిరిలో ఎంతో పట్టున్న బాబూరావు నియోజకవర్గం మారడంతో ఓడిపోయారు. అటు రాజకీయ, వ్యాపార అవసరాలు, ఇటు టీడీపీకి పట్టు లేకపోవడంతో పాటు తన భవిష్యత్ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైసీపీలో భేషరతుగానే చేరాలని నిర్ణయించుకున్నారట.
ఏదేమైనా అసలే టీడీపీ వీక్‌గా ఉన్న పశ్చిమ ప్రకాశంలో కాస్తో కూస్తో పట్టున్న కదిరి బాబూరావు లాంటి పార్టీని వీడితే అది పార్టీకి మరింత ఎదురు దెబ్బే అనుకోవాలి. ఏదేమైనా ఏపీలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారిపోతోందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం.