దేశంలో టెల్కో రంగంలో నెలకొన్న భారీ సంక్షోభం నేపథ్యంలో పలు టెల్కో కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. గత రెండున్నరేళ్లుగా టెలికం రంగంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న జియో సైతం ఇప్పుడు రేట్లు పెంచక తప్పని పరిస్థితి. జియో దెబ్బతో మిగిలిన వోడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు సైతం డేటా, కాల్స్ రేట్లు తగ్గించి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయి.
గత రెండేళ్లుగా కంపెనీలకు వచ్చిన భారీ నష్టాల నేపథ్యంలో చాలా కంపెనీలు ఇప్పటికే మూతదిశగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ నష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక యునినార్ లాంటి సంస్థలు ఎప్పుడే ఎయిర్‌టెల్‌లో విలీనం అయ్యి దేశీయ మార్కెట్ నుంచి నిష్క్రమించాయి. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
అతి త్వరలో వొడాఫోన్ ఐడియా కంపెనీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల రూపాయల నికర నష్టాలు వచ్చాయి. కేవలం మూడు నెలల్లోనే ఈ మేర నష్టాలు అంటే ఎంత పెద్ద కంపెనీ అయినా తట్టుకునే పరిస్థితి ఉండదు. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కంపెనీకి కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలని.. లేనిపక్షంలో కంపెనీని మూసివేయక తప్పదని ప్రకటించారు. హెచ్‌టీ లీడర్ షిప్ సమ్మిట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలని లేకపోతే కంపెనీని మూసివేయాల్సి వస్తుందని అన్నారు. ఈ భారీ నష్టాల నేపథ్యంలో ఇకపై మేం ఇందులో పెట్టుబడులు కూడా పెట్టమని తేల్చేశారు. 2017 సంవత్సరం లో వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమయ్యాయి. విలీనానికి ముందు రెండు, మూడు స్థానాల్లో ఉన్న వొడాఫోన్, ఐడియా కంపెనీలు విలీనమైనప్పటికీ నష్టాలు మాత్రం తప్పటం లేదు.