సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దిశ కేసు నిందితుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం నలుగురి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించనున్నారు. అయితే దిశ నిందితుల అంత్యక్రియలకు కొత్త చిక్కులు వచ్చాయి. నిందితుల్లో ఆరీఫ్‌ది జక్లేర్ గ్రామం. మిగతా ముగ్గురు నిందితులు జొల్లు శివ, జొల్లు నరేశ్, చింతకుంట చెన్నకేశవులుది నారాయణపూర్ జిల్లా గుడిగండ్ల గ్రామం. ఈ గ్రామ శివారులో అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. గుడిగండ్ల గ్రామంలో మూడు మృతదేహాల కోసం పక్కపక్కనే గోతులు తవ్వారు.
అయితే గోతులు తీసిన భూమి తనదని ఓ మహిళ అంటోంది. తమ పట్టా భూముల్లో అంత్యక్రియలు ఏంటని పట్టదారులు అడ్డుకుంటున్నారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు దిక్కతోచని స్థితిలో పడ్డారు. కాసేపట్లో ఖననం చేయాలని అనుకున్న సమయంలో కొత్త సమస్య వచ్చింది. అయితే ఈ రాత్రికే నిందితుల అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు.