జనాభా నియంత్రణ, అవాంఛిత గర్భాల నివారణలో కుటుంబ నియంత్రణ సాధనాల పాత్ర ఎనలేనిది. పిల్స్ మొదలుకొని వ్యాక్సిన్ల నుంచి ఆపరేషన్ల వరకు మార్కెట్‌లో ఎన్నో సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇవన్నీ మహిళలకే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన దశలోనూ పురుషుల కోసం ఒక్క బర్త్ కంట్రోల్ మాత్ర కూడా తయారు చేయకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
గడిచిన శతాబ్దంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మహిళల కోసం ఎన్నో కుటుంబ నియంత్రణ సాధనాలు వచ్చాయి. కానీ, పురుషుల కోసం కండోమ్ మినహా ఇప్పటివరకు ఎలాంటి సాధనాలు లేవు. ఈ అసమౌతల్యాన్ని సరిచేసేందుకు వచ్చే రెండేండ్లలో అనువైన పురుష కుటుంబ నియంత్రణ మాత్రను కొనుగొని, మొదటి దశ ప్రయోగాలు చేరుకుంటామని స్కాట్లాండ్‌లోని దుండీ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్ బరాట్ తెలిపారు.
ఈ పరిశోధనల కోసం వచ్చే రెండేండ్లలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ 17లక్షల డాలర్లను అందించడానికి ముందుకు వచ్చారు.
పురుష కుటుంబ నియంత్రణ మాత్రను కొనుగొనడం అంత సులువేమీ కాదని తెలుస్తున్నది. వీర్యకణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, వీర్యకణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రొటీన్‌ను గుర్తించే అధ్యయనాలు జరగకపోవడం, ప్రస్తుతం ఉన్న అనేక రసాయనాలు, ఔషధాలప్రభావాన్ని స్క్రీన్ చేసే సమర్థ వ్యవస్థ లేకపోవడం తదితర ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందును అధిగమించడం కోసం దుండీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి, సమాంతర పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేశారు.