బీజేపీ మిత్ర ధర్మాన్ని విస్మరించడంపై జనసేన అసంతృప్తిగా ఉందా?. కలిసి చేయాల్సిన ఉద్యమాలు, పోరాటాల్లో వన్ సైడ్‌గా కమలనాధులు కలదలడం జనసేనకు నచ్చడం లేదా?. చివరకు సమన్వయ కమిటీ సమావేశానికి కూడా చొరవ చూపకపోవడం, విలువ ఆధారిత ఆస్తి పన్ను పెంపుపై బీజేపీ నేతలు సింగిల్‌గా ధర్నాలు చేయడాన్ని జనసేన నిశితంగా గమనిస్తోందా?. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు డ్యామేజీ కంట్రోల్ కోసం జనసేనతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారా?. ఇప్పుడు ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న జాబ్ క్యాలెండర్.. విలువ ఆధారిత ఆస్తి పన్ను.. పోలవరం నిర్వాసితుల వ్యవహారంపై బీజేపీ, జనసేన కలిసి కూర్చుని మాట్లాడుకోలేక పోయాయి. బీజేపీ మాత్రం ఇటీవల సమావేశాలు నిర్వహించి ఈ సమస్యలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. బీజేపీ ఈ నిర్ణయం తీసుకునే ముందు గానీ..ఆ తర్వాత గానీ తమను సంప్రదించలేదని జనసేన వర్గాలు అంటున్నాయి .
ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో జనసేనను కూడా కలుపుకుని వెళ్లాలని నేతలు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత జనసేన నేతలతో బీజేపీ నేతలు మాట్లాడలేదని చెబుతున్నారు. అయితే గతంలో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించేందుకు ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై చర్చించేందుకు సమన్వయ కమిటీని బీజేపీ, జనసేనకు చెందిన కీలక నేతలతో నియమించారు. ప్రస్తుతం ఆ కమిటీ కూడా లేకపోవడంతో రెండు పార్టీల మధ్య మాటలు కూడా కరువయ్యాయి.
ఇక ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రస్తుతం పోరాటం అవసరమని జనసేన నేతలు అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి రాగానే..రెండు పార్టీల సంబంధాలపై నిర్మొహమాటంగా మాట్లాడాలని జనసేన నేతలు డిసైడయ్యారు.