బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు ఆ పార్టీ కేంద్ర నేతలు క్లాస్ పీకారా ? అవసరం లేని విషయాల్లో తలదూరుస్తున్నారంటూ ఆయనపై ఫైరయ్యరా ? ఇలాంటి విషయాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కనీసం సంప్రదించరా ? అని నిలదీశారా ? ఈ పరిణామంతో అలకబూనిన కన్నా.. గడిచిన రెండు మూడు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారా ? చివరికి తన ఫోన్‌ను కూడా స్విచ్ఛాప్ చేసుకున్నారా ? అంటే.. ఇవే విషయాలపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు ఔనని, కేంద్రంలోని బీజేపీ పెద్దలు క్లాస్ ఇచ్చారని అంటుంటే.. మరికొందరు.. ఔనా ? అని నోరెళ్లబెడుతున్నారట. మొత్తానికి చాలా గుంభనంగా ఉన్న ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో కథలు కథలుగా కామెంట్లు వైరల్ అవుతుండడం గమనార్హం.
ఇంతకీ విషయంలోకి వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అంతేకాదు, ఈ విషయాన్ని తాము గతంలోనే కేంద్రంలోని ప్రధానికి, హోం మంత్రి అమిత్ షాకు కూడా చెప్పే చేస్తున్నామని .. మంత్రి బొత్స సహా పలువురు పేర్కొన్నారు. బహుశా అందుకేనేమో.. అనేకసార్లు .. రాజధాని ప్రాంత రైతులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరినా.. మాకు సంబంధం లేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెప్పారు. అంతేకాదు, గతంలో చంద్రబాబు అమరావతిని రాజధాని అంటే.. ఓకే అన్నాం.. ఇప్పుడు మారుస్తామని చెబితే.. దానికి కూడా పరిశీలించి ఓకే అంటాం.. అనేశారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇదే గుంటూరు జిల్లాకు చెందిన కన్నా.. పార్టీలైన్ ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూడు రాజధానుల బిల్లులు.. గవర్నర్ చెంతకు చేరాయి. వీటిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ బిల్లును ఆమోదించవద్దని, అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. మరీ ముఖ్యంగా బీజేపీ జాతీయ నేతలకు చేరింది.
దీంతో ఎవరిని అడిగి మీరు గవర్నర్‌కు లేఖ రాశారు? పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖ ఎందుకు రాశారని కన్నాకు ఫోన్‌లోనే పెద్దలు క్లాస్ ఇచ్చారని రాష్ట్రంలోని మిగిలిన నేతలు చర్చించుకుంటున్నారు. మనకు సంబంధం లేని విషయంలో వేలు ఎందుకు పెట్టారని కూడా అన్నారట. దీంతో కన్నా అప్పటి నుంచి అంటే రెండు రోజులుగా మౌనం పాటిస్తున్నారని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుతుండడం గమనార్హం. మరి ఏం జరిగిందో ఆయన నోటి నుంచే వినాలంటే వెయిట్ చేయాల్సిందే.