బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు హైదరాబాద్‌లో ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే.. సోమవారం వరకు జరగనున్న ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం సర్వం సన్నద్ధమైంది. భేటీ కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో నేతలు రాష్ట్రానికి చేరుకోగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరికొందరు నేతలు శుక్రవారం రానున్నారు. జేపీ నడ్డాకు శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నాయి.
జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా, జాతీయ కార్యవర్గ సమావేశ స్థలికి కాకతీయ ప్రాంగణంగా నామకరణం చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు పెట్టారు.జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు ఆఫీస్‌గా పేరు ఖరారు చేశారు. భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ ప్రాంగణంగా..మీడియా హాల్‌కు షోయబుల్లాఖాన్ హల్‌గా.. అతిథులు బసచేసే ప్రాంగణానికి సమ్మక్క–సారలమ్మ నిలయంగా.. తెలంగాణ సంస్కృతిసంప్రదాయాలకు ప్రతిబింబింగా ఏర్పాటు చేస్తున్న ప్రదర్శనశాలకు గొల్లకొండగా పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ భేటీ తీర్మానాలప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరును ఖరారుచేశారు. 4వ తేదీన బీజేపీ సంఘటన కార్యదర్శుల (అన్ని రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల) సమావేశ హల్‌కు కొమురం భీం పేరు పెట్టారు.