ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలో ఓ బ్యాక్టీరియా కలకలం రేపింది. బారీ కాలెబాట్ గ్రూపు నిర్వహణలో బెల్జియంలోని వైజ్ పట్టణంలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ వ్యాప్తి చెందిందని కంపెనీ వెల్లడించింది. లిక్విడ్ చాక్లెట్ ఉత్పత్తి చేసే ఈ కర్మాగారానికి తదుపరి నోటీసు వెలువడే వరకు తయారీని నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ తెలిపారు. మరోవైపు కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.
అయితే దక్షిణ బెల్జియం ఆర్లోన్‌లోని ఫెర్రెరో ఫ్యాక్టరీలోనూ ఇదే తరహాలో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ కేసు బయటపడిన వారాల వ్యవధిలోనే ఈ ఘటన వెలుగు చూడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా 70కి పైగా కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వీటిలో హెర్షే, మోండెలెజ్, నెస్లే వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలకు ఉత్పత్తులు నిలిపివేయాలని ఆదేశించింది. జూన్ 25వ తేదీ వరకు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను నిలిపివేయాలని ఆదేశించింది. బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది.