దేశాన్ని పాలిస్తన్న బీజేపీ వ్యూహంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి తాను ఎదగాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? అంటే.. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నవారు ఔననే అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుదిరితే కప్పు కాఫీ అన్నట్టుగా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న విషయం. ఈ విషయంలో తెలంగాణలో కొంత అవకాశం ఉంది కానీ, ఏపీలో మాత్రం అవకాశం లేదు. అంటే.. ఒంటరిగా ఏపీలో బలంపుంజుకునే అవకాశం లేదు. కానీ, తెలంగాణలో మాత్రం కొంత ప్రయత్నిస్తే.. సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలంగాణ రాజకీయ నాయకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలపైనా ఏదో ఒక రకంగా ఆధిపత్యం చలాయించడం ద్వారా.. ఈ రెండు రాష్ట్రాలను శాసించాలనేది ప్రస్తుత బీజేపీ ఎత్తుగడగా మారింది. అంటే.. తెలంగాణకు పూర్తిగా సహకరిస్తూ.. మేం సహకరిస్తున్నాం.. కాబట్టే.. తెలంగాణలో కేసీఆర్ పాలన సాగించగలుగుతున్నారనే వాదనను బలంగా తీసుకువెళ్తున్నారు. ఇటీవల తెలంగాణలోని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనినే బలో పేతం చేస్తున్నాయి. కేంద్రం అన్ని విధాలా నిధులు ఇస్తోంది. అందుకే తెలంగాణలో అభివృద్ధికార్యక్రమాలు జరుగుతున్నాయి.. అని ప్రచారం ప్రారంభించారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లోనూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, అప్పులు పెరిగిపోతున్నాయని తెలుస్తోంది అయినప్పటికీ జరుగుతున్న అభివృద్ధి మాత్రం ఆగడం లేదు. దీనిని తనకు అడ్వాంటేజ్‌గా బీజేపీ మలుచుకుంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఏవిధంగా సహకరించరాదనే ధోరణితోనే బీజేపీ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదాకు మంగళం పాడింది. ఇప్పుడు అమరావతి విషయంలోనూ మీరు మీరు తన్నుకు చావండి.. తర్వాత మేం తేలుస్తాం అంటూ వ్యహరిస్తోంది. అదేవిధంగా నీటి వివాదాల విషయంలోనూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అంటే.. ఇక్కడి పాలకులకు పాలన చేతకాదని, వస్తే.. గిస్తే.. మేమే రావాలని చెప్పడం తెరవెనుక వ్యూహంగా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే జనసేన నాయకుడితో బీజేపీ పొత్తు పొడుచుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పాలించే సత్తా ఎవరికీ లేదని, బీజేపీ వస్తేనే ఏపీ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఏకైక అజెండాతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్, ఇటు జగన్‌కు మధ్య చిచ్చు రాజేస్తూ.. తాను పబ్బం గడుపుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.