కమలం, కారు విరాళం వార్ కొత్త టర్న్ తీసుకుందా

-

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. రామమందిర నిర్మాణం కోసం బీజేపీ, హిందూ సంఘాలు విరాళాలు సేకరిస్తున్నాయి. మందిర నిర్మాణానికి విరాళాల విషయంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. మరికొందరు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఓ స్పష్టమైన ఆదేశమేదీ పార్టీనుంచి లేకపోవటంతో నేతలు ఎవరికి తోచిన విధంగా వారుంటున్నారు. ఈ తరుణంలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నోటి దూల విరాళాల వివాదం కొత్త టర్న్ తీసుకునేలా చేసిందట..

రామమందిర నిర్మాణానికి విరాళాల కోసం బీజేపీ నేతలు చేస్తున్న ఇంటింటి యాత్రపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు మండిపడ్డారు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు. బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారు. మన గ్రామాల్లో రాముడు లేడా ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా.. తాము కూడా శ్రీరాముని భక్తులమే అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. అయోధ్య రామాలయానికి విరాళాలు ఎందుకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తిరుపతి వెళ్లి ఎందుకు విరాళమిచ్చారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు రామాలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం ఇచ్చారని, ఇది తెలుసుకుని ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిజమైన హిందువే అయితే రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నాయకులకు పిలుపు ఇవ్వాలని సంజయ్ విరుచుక పడ్డారు.

విరాళాల వసూలు బిజెపి పార్టీ కార్యక్రమంలా మారడమే టీఆర్ఎస్ నేతలకు వచ్చిన అసలు సమస్య. అందర్నీ కలుపుకుని దైవ కార్యక్రమంలా బిజెపి నేతలు ముందుకెళ్లి ఉంటే ఎలాంటి వివాదం ఉండేది కాదు. చాలా చోట్ల బిజెపి నేతలు మాత్రమే ఇంటింటికి తిరుగుతూ ఉండటంతో దీన్ని గులాబీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని మరింత వివాదంగా మార్చటం సరైంది కాదనే ధోరణిలో టీఆర్ఎస్ కూడా ఉంది.

మరోవైపు రామమందిరం నిర్మాణానికి మద్దతుగా ఆంధోల్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తనే స్వయంగా విరాళాల సేకరించారు. మొత్తానికి అయోధ్య రామమందిరానికి విరాళాల సేకరణ తెలంగాణలో రాజకీయ రచ్చకు దారి తీసింది. సెంటిమెంట్‌ తో ముడిపడ్డ సున్నిత అంశంపై పార్టీలో భిన్నస్వరాలు టీఆర్ఎస్‌ కి ఇబ్బందికరంగా మారాయి. విరాళాల సేకరణతో జనంలోకెళ్తున్న కమలంపార్టీకి అధికారపార్టీని ఇరుకునపెట్టేందుకు ఇప్పుడు మరో ఇష్యూ దొరికినట్లయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version