కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కొత్త ఇన్ఫెక్షన్‌

-

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండడం ఊరటనిస్తుంది. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో వైద్యులు బ్లాక్‌ ఫంగల్‌ అనే కొత్త ఇన్ఫెక్షన్‌ గుర్తించారు. తాజాగా ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లో ఈ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఇటువంటివి ఆరు కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అయితే కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ సమయంలో కూడా వైరస్ నుంచి కోలుకొన్న కొంత మందికి ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. దీనిని మ్యూకోర్‌మైసిస్‌గా కూడా పిలుస్తారు.

కాగా ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తాజా నివేదికల ప్రకారం బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతుండగా, మూడోవంతు మంది చూపు కోల్పోతున్నారు. ఇక కొంత మందిలో ముఖం,కళ్ల వాపు వంటి లక్షణాలు, ముక్కు ఒక వైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండటం, అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. ఇది ఊపిరితిత్తుల్లోకి చేరితో ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ ఫంగస్ వాతావరణలో సహజంగానే ఉంటుంది. కానీ మనుషులకు సోకడం చాలా అరుదు.అయితే కోవిడ్‌ నుంచి కోలుకొనేందుకు స్టెరాయిడ్‌ ఔషధాలు ఎక్కువ వాడిన వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్‌ కనిపిస్తోందని ఢిల్లీ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ వెల్లడించారు. అలానే అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరతాయి. కొన్ని సందర్భాల్లో శరీరాలకు అయిన గాయాల నుంచి కూడా లోపలకు చేరతాయి. అయితే బయాప్సీ పరీక్షలు నిర్వహించి ఈ ఫంగస్ ను నిర్ధారిస్తారు. కాగా కరోనా వైరస్ లా ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version