గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈటల రాజేందర్ కేసు.. ఇప్పుడు మరో మలుపు తిరగబోతోంది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బ పడటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట గ్రామ పరిధిలో ఈటల తన అనుచరులతో కలిసి 66ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జా చేసినట్టు మెదక్ కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన పేపర్లను సీఎంకు అందజేశారు.
అయితే ఈటలపై అభియోగాలు వచ్చిన 24గంటల్లోపే విచారణ జరిపి, ఆయన నుంచి శాఖను కూడా బదిలీ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
ఇక ఇప్పుడు ఈటలపై మరో కేసు కూడా నమోదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అటవీ భూములు ఆక్రమించుకుని అర కిలోమీటరు మేర రోడ్డు వేశారని విచారణలో తేలింది. ఇందులో భాగంగా ఏపుగా పెరిగిన చెట్లను కొట్టేశారు. ఆ చెట్లన్నీ రైతుల భూముల్లో ఉన్నవే అయినా.. వాటిని కొట్టేసేందుకు అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి.
కానీ అనుమతి తీసుకోకుండానే చెట్లను నరికేశారనే అభియోగం కింద ఆయనపై మరో కేసు నమోదు చేయనున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చట్ట రీత్యా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఆ చెట్లను ఎలా గుర్తిస్తారనేదే ఇప్పుడు పెద్ద సవాల్. ఎన్ని చెట్లు కొట్టేశారో ఎలా తేల్చుతారో చూడాలి. ఏదేమైనా ఈటలపై వరుస దాడులు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.