కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో భాగంగా మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోని ధారవి మురికివాడలో నివసిస్తున్న సుమారు 7.50 లక్షలకు పైగా జనాలకు రానున్న 10-12 రోజుల్లో కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ మొత్తం 1135 కరోనా కేసులు నమోదు కాగా, 72 మంది చనిపోయారు. ఇక ధారవి మురికి వాడలో తాజాగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆ మురికివాడలో ఉన్న 7.50 లక్షల మంది ప్రజలకు బీఎంసీ కరోనా టెస్టులు చేయనుంది. ఈ క్రమంలో మొత్తం 150 మంది వరకు ప్రైవేటు డాక్టర్ల సహాయం తీసుకోనున్నారు.
కాగా దేశంలో గురువారం వరకు 5,865 కరోనా కేసులు నమోదు కాగా.. 169 మంది చనిపోయారు. ఇక మహారాష్ట్రలో నిత్యం భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోనుంది.